04/07/2020
దానంతోనే జన్మకు సార్థకత :VHP నేత రాఘవులుజి
"కృతయుగంలో తపస్సు...
త్రేతాయుగంలో జ్ఞానం...
ద్వాపరయుగంలో యజ్ఞం...
కలియుగంలో దానం..
అనేవి మనిషి జన్మ కు సార్థకతను చేకూరుస్తాయి, ముక్తిని కలిగిస్తాయి అనేది వేదాల సారాంశం" అని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శ్రీ రాఘవులు గారు అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి కారణం చేత మానవాళికి అతి పెద్ద ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే నని.. ఈ కష్టకాలంలో మనిషికి మనిషి తోడ్పాటు నందించడం అత్యంత ఆవశ్యకం అన్నారు. ఇలాంటి విపత్కర సందర్భంలో సేవా భావం కలిగిన వారు తమ శక్తికి మించి దానధర్మాలు చేయడం.. నిస్సహాయులకు అండగా నిలవడం.. అభాగ్యులను ఆదుకోవడం సమాజానికి ఆదర్శం అన్నారు. కోవిద సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ అనూహ్య రెడ్డి గారు తన సొంత ఖర్చుతో వంద రోజుల పాటు పేదలకు సహాయం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. కరోనా నివారణ కోసం భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ప్రారంభం నుంచి అంటే మార్చి 26 నుంచి, జూలై 3వ తేదీ వరకు వంద రోజులుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాఘవులు గారు అనూహ్య రెడ్డి గారిని ప్రశంసించారు. ఈ సందర్భంగా అనూహ్య రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు. ఇటీవల కాలంలో కొంతమంది ప్రముఖులను మనం చూశామని.. వారిలో రతన్ టాటా, అక్షయ్ కుమార్ ,సోను సూద్ మిగతా అనేక మంది ప్రముఖులు ప్రత్యక్షంగా పరోక్షంగా సమాజానికి అండగా నిలబడ్డారనీ.. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా డాక్టర్ అనూహ్య రెడ్డి నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవతకు అద్దం పడుతోందన్నారు. మార్చి 26 నుంచి మొదలు పెడితే ఈరోజు (శనివారం) వరకు ఏకధాటిగా, నిత్యం ఎక్కడో ఒక దగ్గర పేదలకు, అర్హులకు నిత్యావసర సరుకుల తో కూడిన కిట్లను ప్రదానం చేయడం ఆదర్శ మన్నారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బండారు రమేష్ గారు, రాష్ట్ర సహ కార్యదర్శి శ్రీ రాజేశ్వర్ రెడ్డి గారు, ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కో కన్వీనర్ శివరాం గారు, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రచ్చ శ్రీనివాసులు గారు, కలయిక ఫౌండేషన్ చైర్మన్ శ్రీ చేరాల నారాయణ గారు అనుహ్య రెడ్డిని అభినందించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...తాను సంపాదించిన సొమ్ముతో స్వచ్ఛందంగా పేదలకు సేవ చేయడం, కష్టకాలంలో ఆదుకోవడం గొప్ప విషయమన్నారు. సిరి సంపదలు ఎన్ని ఉన్నా స్పందించే హృదయ మే గొప్పదని కీర్తించారు." కోవిద సహృదయ పౌండేషన్" ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు హైదరాబాద్ నగరంతో పాటు, రాష్ట్రమంతా కొనసాగాయి అని గుర్తు చేశారు. మొత్తం సేవా కార్యక్రమాలు పూర్తిచేసి, యజ్ఞం నిర్వహించాలని సంకల్పించడం దైవకార్యం తో సమానం అని విశ్వహిందూ పరిషత్ నాయకులు పేర్కొన్నారు.